Saturday 22 October 2016

Respected Parents...

  1. పిల్లలు ఎప్పుడు లేవాలో, ఎంతసేపు చదవాలో, ఎంతసేపు టీవీ చూడవచ్చో, ఎప్పుడు పడుకోవాలో నేర్పి, అవి ఆచరించే ప్రోత్సాహం అందించండి.
  2. పిల్లలతో వీలైనంత ఎక్కువ సేపు గడపండి. మన సంస్కృతిని వారసత్వంగా మన తరువాతి తరం వారికి అందించాల్సిన బాధ్యత తల్లితండ్రులది. మన పండుగలు, ఆచారాలు, బంధుత్వాలు, పద్దతుల గురించి మీ పిల్లలకు వివరించి చెప్పండి. 
  3. మీ పరిసరాల్లో, ఊరిలో, రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా జరుగుతున్న విషయాలు మీ పిల్లలతో పంచుకో దగినవి ఉంటే, వాటి గురించి వారికి వివరించి చెప్పండి. ఏది మంచి, ఏది చెడు అనేది కూడా రోజువారీ సంఘటనల నుంచి వాళ్ళు అవగాహన చేసుకో గలుగుతారు. ఫాస్ట్ ఫూడ్ తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి, వ్యాయామం చెయ్యడం వల్ల కలిగే ఉపయోగాల గురించి చెప్పండి.
  4. ఎల్లప్పుడు `బాగా చదవండి` అని మాత్రమే చెపుతూ, దానినే `వన్ పాయింట్ ఫార్ములా` గా అమలుపరుస్తూ ఉంటే పిల్లలు మీ మాట వినకుండా మొండికేస్తారు.  
  5. వీలున్నప్పుడు మంచి కథల్ని, ఆసక్తి కరమైన విశేషాలని మీ పిల్లలకు చెప్పండి.  
  6. పిల్లలకు ఏదో ఒక హాబీలో శిక్షణ ఇప్పించండి.
  7. ఇంట్లో స్థలం ఉంటే మొక్కలు వెయ్యండి. గులాబీలు ఎలా పూస్తాయో, టమోటాలు ఎలా కాస్తాయో చూస్తే పిల్లలు ఎంతో ఉత్తేజితులౌతారు. ఇంటి పనుల్లో పాలుపంచుకొనేలా తర్పీదు ఇవ్వండి.
  8. పిల్లలకు పుస్తకాలు చెదివే అలవాటు చెయ్యండి.
  9. ఆప్యాయత నందించే చుట్టాలను కలుస్తూ ఉండండి. బందుత్వాలను మీరు చులకన చేస్తే, మీ పిల్లలకు రేపు డబ్బు, హోదా తప్ప, ఎమోషనల్ సపోర్ట్ అందించే వారుండరు.
  10. పిల్లలిద్దరూ పోట్లాడుకొన్నప్పుడు సహజంగా పెద్దవారిని శిక్షిస్తారు. లేదా న్యాయ దేవతలాగ వాదోపవాదాలు వింటారు. అవి రెండూ పనికి రావు. `సరేలే రండి సరదాగా ఈ పని చేద్దాం` అని డైవర్ట్ చేసి, ఇష్టమైన పని చెయ్యండి.
  11. పిల్లవాడు ఒక చెయ్యకూడని తప్పు చేసినప్పుడు, దాని గురించి అందరికీ ప్రచారం చెయ్యకండి. మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా పశ్చాతాప పడేలా తల్లితండ్రులు కౌన్సిలింగ్ చేస్తే చాలు. 
  12. తల్లితండ్రులు ఎంత బిజీగా ఉన్నా పిల్లలు వచ్చి ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకేసి చూసి నవ్వి, మళ్ళీ మాట్లాడతానని చెప్పాలి తప్ప `నోర్మూసుకో, డోంట్ డిస్టర్బ్ మీ` అని అనకూడదు.
చివరగా, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే - మీరు ఆచరించని విలువలని మీ పిల్లలకు నేర్పడానికి ప్రయత్నించకండి.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...