Sunday, 28 February 2016

What should you learn from your house?


`మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?` అనే పేరుతో వాడ్రేవు చినవీరభద్రుడు రాసి, ఎమెస్కో పబ్లికేషన్స్ వాళ్ళు ముద్రించిన పుస్తకం మన స్కూల్ లైబ్రరీలో ఉంది. మంచి మంచి బొమ్మలతో, క్వాలిటీ పేపర్తో ముద్రించిన పుస్తకం చదవడానికి బాగుంది. రచయిత వాడిన భాష చిన్న పిల్లలకి చక్కగా అర్థమయ్యే విధంగా ఉంది. రచయిత విలువల గురించి, స్వతంత్రంగా ఎవరిపనులు వాళ్ళు చేసుకోవడం గురించి వివరించి చెప్పారు. రచయిత మాటల్లోనే-

విలువ అంటే ఏమిటో తెలుసా?

నువ్వు మిఠాయి తిన్నావనుకో నోరంతా తీపవుతుంది.
మనసంతా తీపవ్వాలంటే ఏం కావాలో తెలుసా?
దేన్నిస్తే నీ మనసంతా తీపెక్కుతుందో దాన్నే విలువ అంటారు.

తక్కినవన్నీ తీసుకున్నప్పుడు అనందంగా ఉంటుంది.
అలాకాక ఇచ్చేటప్పుడు ఆనందం కలిగించేది విలువ.

ముందు నీ చుట్టూ ఉన్నవాళ్ళలో ఏమేమి మంచి విలువలున్నాయో చూడు.
తరువాత క్రమంగా విలువలు కాపాడేవాడిగా, సృష్ఠించే వాడిగా మారాలి.

అదెట్లా అంటావా?

ఇంట్లో చిన్న చిన్న పనుల్లో అమ్మకో, నాన్నకో సాయంగా ఉన్నావనుకో,
అదొక విలువ.

పుస్తకాలు చింపడం మానేసావనుకో,
నీళ్ళు వృదాచెయ్యడం లేదనుకో,
ఆహార పదార్థాల్ని పారెయ్యడం లేదనుకో,
అవి కూడా విలువలే.

అమ్మచెప్పిన మాటకో, నాన్ని ఇచ్చిన ఆజ్ఞకో 
కట్టుబడి ఉన్నావనుకో,
అదొక విలువ.

నువ్వుంటున్న చోటునీ, దుస్తుల్నీ,
చేతుల్నీ శుభ్రంగా ఉంచుకొంటున్నావనుకో,
అదికూడా విలువల్ని కాపాడు కోవడమే.

రానురాను అవన్నీ నీ అలవాట్లుగా మారిపోవాలి.
ఎటువంటి పరిస్థితి ఎదురుకానీ నువ్వెట్లా ప్రవర్తిస్తావో
ఎవరన్నా ఇట్టే ఊహించగలిగారనుకో,
దానర్థం విలు నీ అలవాటుగా మారిపోయిందన్నమాట.

అలాగే-

స్వతంత్రం అంటే నీకు బాగా అనిపించిన వాటిని 
నీకైనువ్వే సాధించుకోవడం అన్నమాట.

చిన్నప్పుడు నీ అంతట నువ్వే నడవడం నేర్చుకొన్నట్టే
పొద్దున్నే లేవడం, హోంవర్క్ చేసుకోవడం.. లాంటి పనులన్నీ
అమ్మో, నాన్నో గుర్తుచెయ్యకుండా నీ అంతట నువ్వే గుర్తుపెట్టుకొని 
చేసుకొంటూ పోవాలి.

అలా చెయ్యడంలో తడబాటు ఉండకూడదు. తొట్రుపడకూడదు.
స్థిమితంగా చేసుకొంటూ పోవాలి.

అలా నీ అంతట నువ్వే పనులు చేసుకొంటున్నప్పుడు నీకు చాలా బాగా అనిపిస్తుంది.
దాన్నే స్వాతంత్రం అంటారు. 

ఇంకా ఈ చిన్ని పుస్తకంలో అమ్మతో ఎలా ఉండాలి, నాన్నతో, చెల్లితో, ఇంటికి వచ్చే అతిధులతో, స్నేహితులతో ఎలా నడుచుకోవాలి లాంటి విషయాలు కూడా ఉన్నాయి. మీ లైబ్రరీ పీరియడ్‌లో, లైబ్రరీ టీచర్ని అడిగి ఈ పుస్తకం చదవండి. దానితో పాటూ బొమ్మలు చూసి ఆనందించండి. చదివిన విషయాలు బాగా అర్థం చేసుకొని, మంచి విలువలు అంటే ఏమిటో మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. అందరూ విలువలు పాటిస్తే మన స్కూలు, ఈ సమజం ఎంతో బాగుంటాయి.

కదూ?

Thursday, 4 February 2016

Lincoln`s Letter to a School

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన కుమారుడిని స్కూల్‌లో చేరుస్తున్నప్పుడు రాసిన ఉత్తరం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. తన కుమారుడు స్కూల్ నుంచి ఏ విలువలు నేర్చుకోవాలి అనే విషయంలో లింకన్  వ్యక్తీకరించిన అభిలాష ప్రతీ తల్లీ, తండ్రిదీ. కాకపోతే అందరి తల్లితండ్రులూ లింకన్‌లా తమ భావాలను వ్యక్తీకరించలేకపోవచ్చు. సూటిగా మనసుని తాకే ఆ లేఖలో విషయాలనీ మీరు కూడా ఇక్కడ చదివి తెలుసుకోండి...

ప్రపంచమా...

నా చిన్నారి చేతిని అందిపుచ్చుకో,
ఈ రోజు వాడు పాఠశాలకి మొదటిసారిగా వెళుతున్నాడు.
కొంతకాలం వరకూ వాడికి అంతా కొత్తగా, వింతగా ఉంటుంది. 
వాడిని సున్నితంగా చూసుకొంటావని ఆశిస్తున్నాను.
ఇప్పటివరకూ మా గూట్లో వాడు రారాజులా పెరిగాడు.
మా ఇంటి పెరటిలో సామ్రాజ్యమేలాడు.
నేనిప్పటి వరకూ వాడి వెనుకే ఉన్నాను-
ఏ చిన్ని గాయం తగిలినా బాగుచెయ్యడానికి,
ఏ చిన్ని బాధ కలిగినా ఓదార్చడానికి.
కానీ, ఇకనుంచి అలా ఉండదు.
ఈ రోజు ఉదయం వాడు ఇంటి మెట్లు దిగి,
చేయి ఊపి, ఓ పెద్ద సాహసయాత్ర ప్రారంభించబోతున్నాడు.
ఈ యాత్రలో యుద్దాలు ఉండవచ్చు,
విషాదాలూ.. దు:ఖాలూ ఉండవచ్చు.
ఈ లోకంలో బ్రతకడానికి విశ్వాసం, ప్రేమ, ధైర్యం కావాలి.
అందుకే ఓ ప్రపంచమా... వాడు నేర్చుకోవలసిన విషయాలని 
వాడి చిన్ని చేతిని అందిపుచ్చుకొని నేర్పించు - వీలైతే చాలా సున్నితంగా.
ఈ లోకంలో... 
అందరూ న్యాయంగా ప్రవర్తించేవాళ్ళే ఉండరని నాకు తెలుసు.
అందరూ నిజమే చెప్పరని నాకు తెలుసు. 
అది వాడు నేర్చుకోవాలి.
వాడికి నేర్పించు -
ఈ లోకంలో ఒక దుష్టుడు ఉంటే -ఒక ఉదాత్త నాయకుడూ ఉన్నాడు.
ఒక శత్రువు ఉంటే - ఒక స్నేహితుడు ఉన్నాడు.
ఈ ప్రపంచాన్ని భయపెట్టి విర్రవీగేవారు 
త్వరగా మట్టి కరుస్తారని చెప్పు.
పుస్తకాలు అద్బుతమైనవని తెలియజేయి.
ఆకాశంలో ఎగిరే పక్షులు, 
పచ్చని కొండలపై పూచే పువ్వులు,
తేనెటీగలు...
ప్రకృతిలో అంతుచిక్కని రహస్యాలగురించి
ఆలోచించే సమయమూ, తీరికా ఇవ్వు.
మొసంచేసి గెలవడం కన్నా, ఓడిపోవడమే గొప్పదని నేర్పించు.
అందరూ తప్పని అన్నప్పటికీ 
తన అభిప్రాయాలమీద నమ్మకం ఉండాలన్న విషయం నేర్పించు.
అందరూ నడిచేదారిని గుడ్డిగా అనుసరించకుండా
వాడికి తగిన బలాన్నివ్వు.
ఇతరులు చెప్పేది వినాలని చెప్పు... అయితే,
సత్యం అనే గుడ్డలో వడగట్టి వచ్చిన మంచినే పట్టుకొమ్మని చెప్పు.
తన హృదయాన్నీ, ఆత్మనీ వెలకట్టి ఎప్పుడూ అమ్ముకోవద్దని చెప్పు.
తనను అపహాస్యం చేసే వారి మాటలు వినకుండా చెవులు మూసుకొమ్మని చెప్పు.
తాను సరైనదని నమ్మినదాని కోసం ఎదురునిలిచి పోరాడమని చెప్పు.
కానీ, ఓ ప్రపంచమా..
ఇవన్నీ వాడికి సున్నితంగా నేర్పించు.
అలాగని, కష్టమనేది తెలియకుండా చెయ్యకు.
నిప్పులో కాలితే కానీ, మంచిరకం ఉక్కు తయారు కాదు.
ప్రపంచమా ఇది నేను నీకు ఇచ్చే పెద్ద ఆజ్ఞ కావచ్చు.
కానీ నీవు ఏమి చెయ్యగలవో చూడు.
వాడు ఎంతో మంచి పిల్లవాడు. 

- అబ్రహం లింకన్ 
Related Posts Plugin for WordPress, Blogger...