Tuesday, 14 November 2017

చాచా నెహ్రూ

జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధాని. 1947లో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది మొదలు 1964లో నెహ్రూ మరణించే వరకూ ఆయనే ప్రధానిగా ఉన్నారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 14న అంటే - నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నాము. మన పాఠశాలలో ఈ సంవత్సరం ఎన్నో పోటీలూ, సాంస్కృతిక కార్యక్రమాలూ ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలు నెహ్రూ వేషధారణలో ఉన్న యూకేజీ చిన్నారులవి. ఈ సందర్భంగా చాచా నెహ్రూ గురించి క్లుప్తంగా తెలుసుకొందాం.
మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణీ దంపతులకు జవహర్లాల్ 1889వ సంవత్సరంలో అలహాబాద్‌లో జన్మించారు. మోతీలాల్ నెహ్రూ చాలా పెద్ద లాయరు. వాళ్ళు చాలా సంపన్నులు. ఆనంద్‌భవన్ అనే రాజప్రసాదం లాంటి విశాలమైన భవనంలో జవహర్లాల్ నెహ్రూ బాల్యం గడిచింది. చిన్నప్పుడు విద్యాభాసం ప్రయివేట్ ట్యూటర్ ద్వారా అలహాబాద్‌లో ఇంటిదగ్గరే జరిగింది. తరువాత కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదివారు. ఆ వెంటనే లండన్‌లో బారిష్టర్ చదివి, భారతదేశానికి తిరిగి వచ్చారు.
అలహాబాద్ హై్‌కోర్టులో లాయరుగా ప్రాక్టీస్ మొదలుపెట్టినా, దానిని కొనసాగించలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరి, మహాత్మా గాంధీ అనుంగ శిష్యుడిగా భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. చివరికి మనదేశం బానిసత్వం నుంచి విముక్తం అయిన తరువాత ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. దేశాన్ని సమర్ధవంతంగా ముందుకు నడిపించి, అన్నిరంగాలలోనూ అభివృద్దికి బాటలు వేశారు. 
ఆంగ్లంలో ఎన్నో రచనలు చేశారు. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వాల్డ్ హిస్టరీ, ఆటో బయోగ్రఫీలు నెహ్రూ యొక్క ప్రసిద్ధ రచనలు. నెహ్రూగారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని (ఇందిరా గాంధీ)కి పది సంవత్సరాల వయసులో - ఆమె ముస్సూరీలో ఉన్న ఒక బోర్డింగ్ స్కూల్‌లో చదువుతూ ఉండేది. ఆ సమయంలో నెహ్రూ తన కుమార్తెకు నేచురల్ హిస్టరీ, ప్రపంచ నాగరికతల గురించి వివరిస్తూ సుమారు ముప్పై ఉత్తరాలు రాశారు. అవి అన్నీ `లెటర్స్ ఫ్రం ఎ ఫాదర్ టు హిస్ డాటర్` పేరుతో పుస్తకంగా అచ్చయ్యాయి.

1955వ సంవత్సరంలో భారతరత్న పురస్కారాన్ని అందుకొన్నారు. 1964లో పరమపదించారు. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...